హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. వర్మ 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్రం విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ చిత్ర విడుదలపై దాఖలైన పిటిషన్‌పై సెన్సార్ బోర్డు, చిత్ర యూనిట్ కౌంటర్ దాఖలు చేసింది. కాగా వీటిపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇప్పటివరకు ఈ చిత్రానికి సెన్సార్ సర్టిపికేట్ ఇవ్వలేదని, బోర్డు సూచనల మేరకు టీవీ చానళ్ల లోగోలను కూడా తొలగించామని కోర్టుకు మూవీ యూనిట్ తెలిపింది. అయితే చిత్రంలో మతపరమైన అంశాలతో పాటు, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో విడుదల ఆపాలని ఎగ్జామినేషన్ కమిటీ పేర్కొన్నట్లు హైకోర్టు తెలిపింది.
అయితే రివ్యూ కమిటీ ఇప్పటికే చిత్ర యూనిట్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చిందని తెలంగాణ అడిషనల్ సోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. అభ్యంతరాలన్ని సవరించుకున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏంటని సోలిసిటర్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే రివ్యూ కమిటీ ఇంకా చిత్రాన్ని చూడలేదని తెలపడంతో, సినిమా చూసి నిర్ణయం తెలపాలని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా సినిమా విడుదల అంశం రివ్యూ కమిటీ పరిధిలో ఉండటంతో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అదేవిధంగా రివ్యూ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్‌పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అన్ని సక్రమంగా ఉన్నట్లుయితే ఆర్డర్ పాస్ చేయాలని రివ్యూ కమిటీకి హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది.